పెళ్లికొడుకు తాగి వచ్చాడని పెళ్లి పీటల మీదనే పెళ్లి రద్దు చేసుకున్న పెళ్లి కూతురు

పెళ్లికొడుకు తాగి వచ్చాడని పెళ్లి పీటల మీదనే పెళ్లి రద్దు చేసుకుంది పెళ్లి కూతురు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జన్సా స్టేషన్ ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఆదివారం రాత్రి ముహూర్తం. పెళ్లికొడుకు తన బంధువులు స్నేహితులతో కలిసి ఫంక్షన్ హాల్‌కు ఊరేగింపుగా వచ్చాడు.

ఆ తరువాత వేదికపై నిలబడి దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యాడు. వధువు కూడా దండాలు మార్చుకునేందుకు తలవంచగా..ఇంతలో మద్యంమత్తులో వరుడి స్నేహితులు వధువు వెంట వచ్చిన యువతులను చూసి పెద్ద పెట్టున కేకలు వేశారు.

దీంతో, వరుడు కూడా మద్యం తాగినట్టు గుర్తించిన యువతి అప్పటికప్పుడు పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు చెప్పి వేదిక దిగి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల వారు వధువుకు సర్దిచెప్పేందుకు విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. చివరకు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.