నేటి నుంచే 2వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చు

నేటి నుంచే బ్యాంకుల్లో 2వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చు. 2016లో నోట్ల రద్దు దరిమిలా చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను కేంద్రం రీసెంట్ గా ఉపసంహరించినట్లు తెలిపింది. రూ.2 వేల నోట్లు ఇవ్వడం తక్షణం ఆపేయాలని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది.

రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 (నేటినుండి) నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ.20వేల వరకు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్‌ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందీ లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియకు గడువు విధించింది ఆర్బీఐ. దీని కోసం ఎవ్వరూ ఎలాంటి గుర్తింపు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

నోట్లు మార్చుకునేందుకు 4 నెలల సమయం ఉన్నందున కస్టమర్లు వెంటనే బ్యాంక్‌లకు వెళ్లాల్సిన అవసరంలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. చలామణి నుంచి ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నప్పటికీ, గడువు వరకు చెల్లుబాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారులు 2000 నోట్లను తిరస్కరించడానికి వీలులేదని, తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. నోట్ల రద్దు మూలంగా ఎన్‌-రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)లు, హెచ్‌1బీ వీసాలు ఉన్న వారి నోట్ల వెనక్కి తీసుకుంటున్నందున ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నోట్లను ఉపసంహరించుకోవడం, కొత్త వాటిని జారీ చేయడం అనేది ఆర్బీఐ సాధారణంగా చేస్తూనే ఉంటుందని, ఈ సారి 2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్‌ చెప్పారు.