ఆదివాసీల కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేస్తాం – మోడీ

We will set up 750 Ekalavya Schools for Adivasis across the country – Modi

Community-verified icon


అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు భీమవరం లో ఏర్పటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఆదివాసీల కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ‘‘పండ్రంగిలో అల్లూరి జన్మ స్థానాన్ని జీర్ణోద్ధరణ చేయడం, ఆంగ్లేయులకు ఎదురొడ్డి అల్లూరి నిలబడిన చింతపల్లి పోలీసు స్టేషన్, ధ్యాన మందిర నిర్మాణాలను చేపట్టి జాతికి అంకితం చేస్తాం’’ అని మోడీ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జీవితంతో ముడిపడిన ప్రాంతాల జీర్ణోద్ధరణకు కృషి చేస్తున్న వారిని ఈసందర్భంగా ప్రధాని అభినందించారు. ‘‘మనదే రాజ్యం నినాదంతో అల్లూరి సీతారామరాజు ఆనాడు ప్రజలను చైతన్యపరిచారు. ‘వందేమాతరం’ నినాదం కూడా ‘మనదే రాజ్యం’ నినాదంతో సరితూగేలా ఉంటుంది.

మన పూర్వీకుల హైందవ చింతన వల్లే అల్లూరిలో త్యాగం, సాహసం, ఉద్యమ పటిమ వచ్చాయి. పాతికేళ్ల వయసులో స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులోనే అల్లూరి స్వర్గస్తులయ్యారు. ఆయన త్యాగం చిరస్మరణీయం’’ అని మోడీ తెలిపారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, లైబ్రరీ నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. లంబసింగి లైబ్రరీ ద్వారా ఆదివాసీల సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. విశాఖలో ట్రైబల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్కిల్ ఇండియా స్కీమ్ ద్వారా ఆదివాసీలకు శిక్షణ అందిస్తామని ప్రధాని తెలిపారు.

అలాగే మన దేశం పరాయ పాలకుల మీద యుద్ధం చేస్తూనే ముందుకు అడుగులు వేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు వారి రక్తాన్ని ధారపోసి మనకు స్వేచ్చను ఇచ్చారన్నారు. అడవిలో అగ్గి పుట్టించిన యోధుడు అల్లూరి అని సామాజిక ఐక్యమత్య అవసరాన్ని గుర్తించిన సంస్కర్త అని కొనియాడారు. అల్లూరి తెలుగుజాతికే కాదు దేశానికే స్పూర్తి ప్రధాత అన్నారు జగన్. ఆయన నడయాడిన నేలకు అల్లూరి పేరు పెట్టినట్లు తెలిపారు. తెలుగుజాతి ఎప్పటికీ అల్లూరిని మర్చిపోదని..అతని త్యాగం ప్రతి వ్యక్తి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని జగన్ అన్నారు.