కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం మారిందా.?

అంటే అవునంటే అంటున్నాయి పార్టీ వర్గాలు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. కేంద్రంలో బిజెపి కి ఎలాగైనా చెక్ పెట్టాలని కంకణం కట్టుకున్న కేసీఆర్..దానికి తగ్గట్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ ..వారి సపోర్ట్ ను తీసుకుంటూ వస్తున్నారు. కాగా దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయాలనీ అనుకున్నారు. కానీ ఇప్పుడు దసరా కు కాకుండా డిసెంబర్ లో ప్రకటన చేయాలనీ భావిస్తున్నట్లు సమాచారం.

జాతీయ పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా, విధి విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ఖరారు చేసి.. ఎన్నికల సంఘంతోనే చర్చలు జరిపి.. ఆ తర్వాత దసరాకు పార్టీని ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ ఇంకా తుది దశకు రానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీకి సంబంధించి.. అంతా సిద్ధం చేసుకున్న తర్వాత.. డిసెంబరులో పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సైతం ఇంకా ప్రారంభించలేదని సమాచారం. జాతీయ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసే తీర్మానం ప్రతిని కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ అంశంపైనా ఆయన దృష్టి సారించినట్లు తెలిసింది.