ఆ నాటి చీక‌టి రోజుల‌ను ఎన్న‌టికీ మరువలేం!

న్యూఢిల్లీ: 1975 నాటి ఎమ‌ర్జెన్సీ చీక‌టి రోజుల‌ను ఎన్న‌టికీ మరువలేమని ప్ర‌ధాని మోడి అన్నారు. 1975 నుంచి 1977 వ‌ర‌కు వ్య‌వ‌స్థీకృత ప‌ద్ధ‌తిలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌న్నారు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్య స్పూర్తిని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌తిజ్ఞ చేయాల‌న్నారు. రాజ్యాంగంలో పొందుప‌రిచిన విలువ‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌న్నారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఖాతాలో ప్ర‌ధాని మోడి ఈ అభిప్రాయాలను వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్య మూలాల‌ను కాంగ్రెస్ ధ్వంసం చేసింద‌ని, దానికి సంబంధించిన సాక్ష్యాల‌ను ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో పొందుప‌రిచారు. ఇన్‌స్టాగ్రామ్ లింకు ద్వారా కాంగ్రెస్ చేసిన అకృత్యాల‌ను ఆయ‌న గుర్తు చేశారు. ఎమ‌ర్జెన్సీని ఎంద‌రో హేమాహేమీల‌ను వ్య‌తిరేకించార‌ని, భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని వారు ప‌రిర‌క్షించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. డార్క్ డేస్ ఆఫ్ ఎమ‌ర్జెన్సీ హ్యాష్‌ట్యాగ్‌తో మోడి ఇన్‌స్టాలో కొన్ని అంశాల‌ను వెల్ల‌డించారు.

కాగా, 46 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్ర‌ధాని ఇందిరా గాంధీ దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీని అమ‌లు చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇందిర అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు అల‌హాబాద్ హైకోర్టు త‌న తీర్పులో తెలిపింది. దీంతో ఆమెను ఆరేళ్ల పాటు పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని ఇందిరా దేశ‌వ్యాప్త ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/