పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఖమ్మంలో పోస్టర్లు

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు..కలకలం రేపుతున్న పోస్టర్లు

warning-posters-to-ponguleti-srinivas-reddy-in-khammam

హైదరాబాద్‌ః తెలంగాణ శాసనసభకు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బిఆర్ఎస్ నుంచి బహిష్కృతులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీపై ఆయన చిప్పులు చెరుగుతున్నారు. కెసిఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని చెపుతున్నారు.

ఈ క్రమంలో పొంగులేటికి వార్నింగ్ ఇస్తూ ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవంటూ పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్ఎస్ పై, మంత్రి పువ్వాడ అజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు ఖమ్మంలో కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లపై పొంగులేటి ఇంకా స్పందించాల్సి ఉంది.