మాస్క్ లు ధరించనివారికి..మాస్క్‌లు తొడిగిన ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏంచేసినా వార్తల్లో నిలువాల్సిందే. అందరు ముఖ్యమంత్రుల్లా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా , ఓమిక్రాన్ వైరస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో చాల రాష్ట్రాలు కరోనా ఆంక్షలు మొదలుపెట్టాయి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని , సామాజిక దూరం పాటించాలని , విందులు , వినోదాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం తో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆంక్షలను కఠినతరం చేసింది. అయినప్పటికీ చాలామంది మాస్క్ లు లేకుండానే రోడ్ల పైకి వస్తున్నారు.

దీంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి మాస్క్ లు పెట్టుకొని వారి దగ్గరకు వెళ్లి మాస్క్ పెట్టారు. చెన్నై రోడ్లపై మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాన్ని చూసి కాన్వాయ్‌లో వెళ్తోన్న సీఎం స్టాలిన్ వాహనాన్ని ఆపి.. కిందకు దిగారు. మొఖానికి మాస్క్‌లు లేని వారి దగ్గరకు వెళ్లి స్వయంగా ఆయనే మాస్క్‌లు తొడిగారు. అక్కడున్న ఇతరుల దగ్గరకు కూడా వెళ్లి మాస్క్‌లను అందజేశారు. అది చూసిన చాలామంది కాన్వాయ్ దగ్గరకు రావడంతో వారందరికీ మాస్క్‌లు అందజేశారు. మాస్క్‌లు ఇస్తూ నిబంధనలు పాటించాలని , లేదంటే వైరస్ బారిన పడతారని హెచ్చరించారు. వైద్యులు సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.