రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి తానేటి వనిత

టీడీపీపై ధ్వజమెత్తిన మంత్రి తానేటి వనిత

అమరావతి: రేపల్లె రైల్వేస్టేషన్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి తానేటి వనిత, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అత్యాచార బాధితురాలిని పరామర్శించారు.

ఈ సందర్భంగా, హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో హత్యలు, అత్యాచార ఘటనల నిందితుల్లో టీడీపీ వాళ్లే ఎక్కువమంది ఉంటున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అటు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ, రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఘటనలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. రేపల్లె ఘటనలో రైల్వే అధికారులను నివేదిక కోరామని తెలిపారు. రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/