నేడు అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట కోదండ‌రాముడి క‌ల్యాణం

నేడు కన్నులపండుగగా ఒంటిమిట్ట కోదండ‌రాముడి క‌ల్యాణం జరగనుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పౌర్ణమి రాత్రి పండు వెన్నెల్లో ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణం జరగడం ప్రత్యేకత. సోమవారం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నిండు పున్నమి వెలుగుల్లో వైభవంగా సీతారాముల కళ్యాణం జరగనుంది. కళ్యాణోత్సవం కారణంగా ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. అందులో భాగంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్ట ఆనవాయితీగా వస్తుంది.

ఒంటిమిట్ట కోందడరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 25 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వాహన సేవలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న సోమవారం కళ్యాణోత్సవం, 23న రథోత్సవం ,25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.