‘వాలంటీర్లే బూత్ ఏజెంట్లు’.. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై దుమారం

వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా పని చేయాల్సి వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, వాలంటీర్ల విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు.

80 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నందున ఈ ఎన్నికల్లో వాలంటీర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని అన్నారు. బూత్ ఏజెంట్లుగా కూర్చునేందుకు వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని ధర్మాన పేర్కొన్నారు. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఉండవని.. ఎవరికి ఓటు వేయాలో మీరు చెప్పకపోతే ఎవరు చెబుతారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.