ఏపీలో థియేటర్లపై అధికారుల తనిఖీలు..మూడు థియేటర్స్ సీజ్

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. జీవో నెం. 35 ని రద్దు చేస్తూ గతవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసిన సంగతి తెలిసిందే. జీవో నెం.35 ను కోర్టు రద్దు చేసినా.. థియేటర్ యజమానులు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్ల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది థియేటర్స్ కలెక్టర్ల అనుమతి తీసుకోకుండానే టికెట్స్ పెంచుతున్నారు. ఈ క్రమంలో అధికారులు తనికీలు ముమ్మరం చేసారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్న సినిమా హాళ్లపై కఠిన చర్యలకు రెడీ అవుతున్నారు. నిబంధనలు పాటించని థియేటర్లపై నిషేధం విధిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మూడు సినిమా హాళ్లను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని పూసపాటిరేగ‌, భోగాపురం, నెల్లిమర్ల మండ‌లాల్లో జాయింట్ క‌లెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా ప‌ర్యటించారు.

పూస‌పాటిరేగ సాయికృష్ణా థియేట‌ర్‌ను చెక్ చేశారు. దీనిలో 2015 నుంచి ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యువ‌ల్ చేయకపోవడంపై మండిపడ్డారు. వెంటనే థియేటర్‌ను సీజ్ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం భోగాపురం మండ‌లం గోపాల‌కృష్ణ, నెల్లిమర్లలోని ఎస్‌త్రీ సినిమాస్ థియేటర్లను తనిఖీ చేశారు. ఈ రెండు సినిమా హాళ్లలో టికెట్లు అధికారులకు విక్రయిస్తున్నట్లు జేసీ గుర్తించారు. ఈ రెండింటిని కూడా సీజ్ చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. థియేటర్లలో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.