క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న కేసీఆర్..

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మంగళవారం హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మ‌స్ వేడుకల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ కేక్ క‌ట్ చేసి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ లో అన్ని మ‌తాల ప్ర‌జ‌లు స‌మానం అని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున బోనాలు, రంజ‌న్, క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌ర‌పాల‌ని త‌న‌ను ఎవ‌రూ కోర‌లేద‌ని అన్నారు.

ఇవాళ మ‌నం జ‌రుపుకుంటున్న‌టువంటి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న అంద‌రికీ హ్యాపీ క్రిస్మ‌స్, హ్యాపీ న్యూ ఇయ‌ర్. మాన‌వ మ‌నుగ‌డ ఎన్నో ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల క్రితం ఈ భోగోళం మీద ప్రారంభ‌మైంది. మాన‌వ జీవితం అతి ఉజ్వ‌లంగా ముందుకు సాగ‌డానికి ఏ త‌రంలో చేప‌ట్టాల్సిన ప‌నులను ఆ త‌రంలో చేపట్టారు. దాంతో మ‌నం ఇవాళ ప్ర‌శాంతంగా బ‌తుకుతున్నాం. శాస్త్ర‌వేత్త‌లు ఎన్నో అమూల్య‌మైన విష‌యాల‌ను ఈ స‌మాజానికి స‌మ‌కూర్చారు. ఈ రోజు మ‌నం నివ‌సిస్తున్న నాగ‌రిక స‌మాజానికి చేరుకోవ‌డానికి ఎంతో మంది మ‌హానుభావులు త్యాగాలు చేశారు. స్థూలంగా మ‌నిషిగా ఉన్న ప్ర‌తి మ‌నిషి ఎదుటి మ‌నిషిని ప్రేమించ‌డ‌మే అతి గొప్ప ల‌క్ష‌ణం. ఏ మతంలో కూడా త‌ప్పు చేయ‌మ‌ని చెప్ప‌లేదు. అంద‌రూ శాంతిగా బ‌త‌కాల‌ని చెప్పారు. త‌ప్పులు చేయ‌మ‌ని ఏ మ‌త‌బోధ‌కులు చెప్ప‌లేదు. ఏ మ‌తంలో కూడా త‌ప్పులేదు. మ‌తం ఉన్మాద‌స్థితికి వెళ్లిన‌ప్పుడే త‌ప్పు జ‌రుగుతోంది అని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే రాష్ట్రంలో గ‌త ఏడాది క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉండ‌టం వల్ల క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌ర‌పుకోలేక పోయామ‌ని అన్నారు. కరోనా వైర‌స్ నుంచి దేశం బ‌య‌ట ప‌డాల‌ని ఏసు ను ప్రార్థిస్తున్న‌ట్టు తెలిపారు.