తెలంగాణ లో మరో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని ,ప్రజలను కలవరపాటుకు గురి చేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నలుగురు బాధితుల్లో ముగ్గురు నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. మరొకరికి మాత్రం ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తితో కాంటాక్ట్ లో ఉండటం వల్ల సోకినట్లు సమాచారం. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 24కు చేరింది.

రాష్ట్రంలో రోజురోజుకీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వారిని గాంధీ, గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈరోజు మరో నలుగురికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన వారికి ఒమిక్రాన్ సోకడంతో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటికే 200 పాజిటివ్ కేసులు దాటిపోయాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలుస్తుంది.