చిరంజీవి కోసం లక్ష బీర్ బాటిళ్లు

మెగాస్టార్ చిరంజీవి కోసం లక్ష బీర్ బాటిళ్లు సిద్ధం చేసారు విశ్వంభర టీం. చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్‌ ‘విశ్వంభర’. ‘బింబిసార’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ఠ..ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ గత కొద్దీ రోజులుగా శరవేగంగా నడుస్తుంది. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో తాజా షెడ్యూల్ మొదలుపెట్టారు. లక్ష బీర్ బాటిళ్లతో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.

ఇంటర్వెల్‌కు ముందు రాబోయే ఈ సీన్ కోసం చిరు 68 ఏళ్ల వయసులోనూ ఎన్నో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి, కొంతమంది ఫైటర్ల మధ్య దీన్ని షూట్ చేస్తున్నారట. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షణలో ఈ యాక్షన్ పార్ట్ నడుస్తుంది. భారీ స్థాయిలో షూట్ చేస్తున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా ఉండనుందని మూవీ టీమ్ చెబుతోంది. మరి ఆ ఫైట్ ఏ రేంజ్ లో వచ్చిందనేది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. 2025 జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.