కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇకలేనట్లే..

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అనేది ఇక మరచిపోవాల్సిందే అని కేంద్రం తెలిపింది. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు అంశాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి రాజ్య‌స‌భ‌లో శుక్రవారం లేవ‌నెత్తారు. భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా.. కోచ్‌ల తయారీ సామర్థ్యం ప్రస్తుతానికి ఉందని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ఇది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకుంది కార్మికలోకం. అయితే, ఆ ఆశలను సమాధి చేసేసింది కేంద్రం. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను తుంగలో తొక్కుతూ సంచలన ప్రకటన చేసింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు వెళ్లినా కేంద్రం బుట్టదాఖలు చేసింది. పార్లమెంట్‌లో నిలదీసినా నిస్సిగ్గుగా సమాధానం దాటవేశారే కానీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పిన పాపాన పోలేదు. దేశంలో ఎక్కడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించింది. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించింది.