జైలులో 4.5 కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్ః ఆప్ నేతలు

Kejriwal lost 4.5 kg in jail, BJP putting his health at risk: AAP

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో అరెస్టై తీహార్ జైలు పాలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. జైలులో ఒక్కరోజు గడిచేసరికే విపరీతంగా బరువు కోల్పోయారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్‌ ఒక్కరోజులోనే 4.5 కిలోల బరువు తగ్గారని జైలు అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపాయి. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ కూడా పడిపోయాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే, ఢిల్లీ సీఎం ఆరోగ్యంగానే ఉన్నారని, జైలు డాక్టర్ ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారని వివరించారు. ఒక దశలో బ్లడ్ షుగర్ లెవల్స్ 50 కి పడిపోవడంతో డాక్టర్లు మందులు ఇచ్చారని, ప్రస్తుతం ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాయని తెలిపారు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి కేజ్రీవాల్ కు సెన్సార్ ను అందజేసినట్లు జైలు అధికారులు తెలిపారు. సడెన్ గా మళ్లీ షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదం ఉండడంతో ఆయనకు టోఫీస్ (చాక్లెట్లు) ఇచ్చినట్లు తెలిపారు. కొన్నిరోజులు ఆయనకు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. కాగా, కేజ్రీవాల్ బరువు తగ్గారంటూ ఆప్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని జైలు అధికారులు కొట్టిపారేశారు. ఆయన జైలుకు వచ్చినపుడు 55 కేజీల బరువు ఉన్నారని, ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నారని తేల్చిచెప్పారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు.

ఈ కేసులో కేజ్రీవాల్ కు కోర్టు ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి వరకు ఆయన తీహార్ జైలులోనే ఉండనున్నారు. తీహార్ జైలు నెంబర్ 2 లో కేజ్రీవాల్ కు స్పెషల్ సెల్ కేటాయించిన అధికారులు.. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు పలు సౌకర్యాలు కల్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్ ను 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ కోరిన పుస్తకాలు కూడా అందించామని తెలిపారు. ఇక, మొదటి రోజు జైలులో కేజ్రీవాల్ అశాంతిగా గడిపారని, నిద్ర పట్టక పోవడంతో తన సెల్ లోనే అర్ధరాత్రి వాకింగ్ చేశారని జైలు అధికారులు వివరించారు.