వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ లో చెత్తా చెదారం.. ఫొటో వైరల్

చెత్తతో నిండిన బోగీ ఫొటోను ట్వీట్ చేసిన ఐఏఎస్ అవనీష్ శరణ్

viral-photo-shows-garbage-inside-vande-bharat-express

న్యూఢిల్లీః మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సరిగ్గా వినియోగించుకోవడం లేదు. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లు.. ప్రయాణికుల నిర్లక్ష్యంతో చెత్తతో నిండిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోపల చెత్త పేరుకున్న ఫొటోను ఓ ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు.

మనం ప్రజలం అనే అర్థం వచ్చేలా ‘వి ది పీపుల్’ కాప్షన్ ఇచ్చి ఫొటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్వీట్ చేశారు. నీళ్ల బాటిళ్లు, ఆహార ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ వస్తువులు.. అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం, వాటిని స్వీపర్ ఊడుస్తుండటం అందులో కనిపించింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోకు వందల మంది కామెంట్లు చేస్తున్నారు. “సర్.. మన దేశంలో ప్రజలకు వారి డ్యూటీ తెలియదు కానీ.. వారి హక్కు మాత్రం కచ్చితంగా తెలుసు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘మేము మెరుగైన సౌకర్యాలు, మంచి మౌలిక సదుపాయాలు కావాలని అడుగుతుంటాం. కానీ మన దేశంలోని ప్రజలకు శుభ్రంగా ఉంచుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం తెలియదు’’ అని మరొకరు స్పందించారు. ఇది చాలా బాధాకరమని.. ట్రైన్ ఏదైనా మన దేశంలో ఇంతేనని ఇంకొకరు పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/