అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్ ఎదుర్కోవాల్సిందే : సుప్రీంకోర్టు

తీర్మానంపై ఓటింగ్‌ను ర‌ద్దు చేయ‌డం కుద‌ర‌దు
ఈ నెల 9న తీర్మానంపై ఓటింగ్ నిర్వ‌హించాలి..సుప్రీంకోర్టు


ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు గ‌ట్టి షాకే త‌గిలింది. ఇమ్రాన్ స‌ర్కారుపై విప‌క్షాలు ప్ర‌తిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌రిగి తీరాల్సిందేన‌ని తీర్పు చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 9న ఓటింగ్‌ను నిర్వ‌హించాల‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు పాక్ సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వంపై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇమ్రాన్ పార్టీకి చెందిన కొంద‌రితో పాటు ఆయ‌న‌కు మ‌ద్దతు ఇస్తున్న మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన కొంద‌రు విప‌క్షంతో చేరిపోయారు. దీంతో త‌మ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ కోసం ఓ స‌రికొత్త వ్యూహాన్ని అమ‌లు చేసిన ఇమ్రాన్… పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్‌తో ఓ ప్ర‌క‌టన చేయించారు.

ఇమ్రాన్ వ్యూహం మేర‌కు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ర‌ద్దు చేసిన డిప్యూటీ స్పీక‌ర్..ఏకంగా జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేశారు. ఈ ప‌రిణామంపై విప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ పిటిష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఇందుకోసం జాతీయ అసెంబ్లీని పున‌రుద్ధ‌రించాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీక‌ర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చ‌డం స‌రికాద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/