రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని చంద్రబాబు ఫై విజయసాయి ఫైర్

వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి..టీడీపీ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై మండిపడ్డారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతోనే కోనసీమలో చంద్రబాబు గ్యాంగ్ విధ్వంసకాండకు పాల్పడిందని విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబేద్కర్ ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని మండిపడ్డారు. మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలని చూడడం వృథా ప్రయాసేనని అన్నారు.

నిప్పుతో చెలగాటం మంచిది కాదని, ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలారని పేర్కొన్నారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం దగ్గర్నుంచి.. చంద్రబాబు చేసిన అనేక అరాచకాలను జనం మరచిపోలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు.