అశోక్ గజపతిరాజుపై విజ‌య‌సాయిరెడ్డి ఆరోపణలు

42 మంది చనిపోతే దానిని మావోల దుశ్చర్య అన్నారు

అమరావతి : వైస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్ గజపతిరాజుపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. 2017లో హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీకి ఆయ‌న లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే అంశంపై ఆయ‌న మ‌రిన్ని ఆరోప‌ణ‌లు చేశారు. ‘ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్రలో అశోకుడే బాబుకు కుడి భుజం అయ్యాడు. ద్రోహమే జీవన విధానంగా మార్చుకున్నాడు. 2017లో కూనేరులో హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 42 మంది చనిపోతే దానిని మావోల దుశ్చర్య అని ప్రకటించేలా రైల్వే సేఫ్టీ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఎన్ఐఏను తప్పుదోవ పట్టించాడు’ అని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు.

‘పట్టా విరిగి ఘోర రైలు ప్రమాదం జరిగితే బాధ్యుడైన అప్పటి డీఆర్‌ఎంను రక్షించడానికి నక్సల్స్ విధ్వంసం అనే కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఇదంతా అశోక్ కనుసన్నల్లోనే జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. కేసును చంద్రబాబు ప్రభుత్వంలోని సీఐడీకి బదిలీ చేశారు’ అని విజ‌యసాయిరెడ్డి ఆరోపించారు. ‘హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన వారంతా ఉత్తరాంధ్ర, ఒడిశాలకు చెందిన గిరిజనులు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించి మృతుల కుటుంబాలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నాడు అశోక్. డబ్బుకు లొంగిపోయి విషాద దుర్ఘటనను నక్సల్స్ పైకి నెట్టి చేతులు దులుపుకున్నాడు. పాపం వెంటాడుతుంది అశోక్’ అని విజ‌యసాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/