ఆచరణీయం
ఆధ్యాత్మిక చింతన

కార్యం చక్కగా నెరవేర్చుటకు పురుష ప్రయత్నం, దైవానుగ్రహం అవశ్యం. పురుష ప్రయత్నం అనేది కార్యసిద్ధికి మొదటగా కావలసింది.
కార్యం తలపెట్టినపుడు దానివలన కలిగే మంచి-చెడులు ముందుగా తెలుసుకోవాలి. బుద్ధి ద్వారా నిశ్చయించాలి. తలపెట్టిన కార్యం సిద్ధించటానికి మనస్సు లగ్నం చేయాలి. దృఢ సంకల్పం వుండాలి.
ధర్మార్థ కామములు సంపాదించటానికి భార్య సహకారం అవసరం. ఆ విధంగానే కార్యము సానుకూల మగుటకు ఇతరుల సహకారం కూడా ముఖ్యం.
కార్య సాధనయందు ఉత్సాహం ప్రథమం. పరిస్థితులు అనుకూలించని సమయాలలో దిగులు పడకూడదు. ఉత్సాహంతో తిరిగి ప్రయత్నించాలి.
మనస్సు పరితాపము చెందినవేళ బుద్ధి వ్యాకులతను నిరోధించాలి.
సామ, దాన, భేద దండోపాయముల ద్వారా కార్యాన్ని సాధించాలి. శుభ కార్యాలలో విఘ్నాలు కలగవచ్చునన్నది పెద్దల మాట. అందుకు కార్యసిద్ధికి దైవానుగ్రహం సంపాదించాలి.
వినాయకుడిని పూజించటం, ఇష్టదైవములను ప్రార్థించడం, అధిష్టాన దేవతలను పూజించడం, మొక్కులు అనాదిగా ఆచరిస్తున్న విషయం.
వేంకటేశ్వరస్వామి ఆపదమొక్కులవాడని ప్రసిద్ధి. విశ్వసనీయత నుబట్టి ఆయా దేవతలను కార్యసిద్ధికొరకు మొక్కుకుంటారు.
కార్యం సాధించిన తదుపరి మొక్కులు తీర్చుకుంటారని తెలిసిందే. ఇలా దైవానుగ్రహం కార్యసాధనకొరకు పొందుతారు.
ప్రార్థించుట వలన దేవతలు కార్యసిద్ధికి తోడ్పడతారు. సీతాన్వేషణకు సముద్రం దాటి లంకకు వెళ్లటానికి జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రేరేపించాడు. అంగదాది వానరులు ప్రస్తుతించారు.
సముద్రాన్ని అవలీలగా దాటి లంకా నగరంలో ప్రవేశించి సీతమ్మను దర్శించి, కార్యసిద్ధితో మీకందరకు సంతోషం కలుగచేస్తానన్నాడు,
హనుమంతుడు. ఇది ఆంజనేయుని బుద్ధి నిశ్చయం. అనుకున్న దానిని సాధించి తీరుతానన్నాడు.
అలాగే దేవతలందరి సహాయం పొందాడు. సీతకొరకు లంకా నగరమంతా గాలించాడు. రావణ అంతఃపురమంతా వెతికాడు.
ఎంత వెదికినా సీతాదేవి కన్పించలేదు. సీతాదేవి జాడ తెలియక హనుమంతుడు పరి పరి విధాల ఆలోచన లతో వ్యాకులతో చెందాడు.
తొందరపాటు పడకూడదని, దిగులు చెందరాదని ఉత్సాహం వహించి తిరిగి తిరిగి జాడ తెలిసేవరకు వెదకాలని, సీతాదేవి దర్శనం కాకుండా లంకా నగరం విడదరాదని హనుమంతుని మనస్సునందు నిర్మల భావం చిగురించిది.
ఇది కార్య సాధకులకు ఉండవలసిన లక్షణం. ఎట్టి ఆటంకాలు ఎదురైనా, కాలం ప్రతికూలమైనా సరే, కాలానికి భయపడకుండా అడ్డంకులను ఎదుర్కొని శ్రమించితే అప్పుడు దైవం అనుకూలించి కార్య సాఫల్యం కలుగుతుంది.
అలాకాక కార్యసాధకుని ప్రయత్నం లేకుండా కేవలం దైవం మీద భారం వేస్తే, అది గాలిలో దీపం పెట్టిన చందంగా తయారవుతుంది.
అష్ట వసువులకు, ఏకాదశ రుద్రులకు, ద్వాదశాది త్యులకు, అశ్వనీ దేవతలకు మరుత్తులకు నమస్కరించాడు. ఎ
దురుగా వున్న అశోకవనం ప్రవేశించి వెదుకుదామని స్ఫురించింది. రామలక్ష్మణు లను, సీతామాతను ప్రార్థించాడు.
తిరిగి రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునికి, సూర్యచంద్రులకు, మరుదేవతలకు నమస్క రించాడు. అశోకవనమందు సీతమ్మ దర్శనమయింది.
ఆనందభరితుడైనాడు. అనితర కష్టసాధ్యమైన కార్యాన్ని సాధించుటచే, సీతాన్వేషణ పండితాయనః అని హనుమంతుని సేవిస్తాం.
కార్యసిద్ధికి హనుమంతుడు చూపిన ఒరవడి ఆచరణీయం.
- ఉలాపు బాలకేశవులు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/