నేడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్

తిరుమలలో ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

cm-jagan-visit-tirumala-temple-today

అమరావతిః కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయయ్యాయి. ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు. ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.15 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కలియుగదైవం కొలువైన క్షేత్రంలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈరోజు సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అలిపిరిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ప్రారంభించనునున్నారు. రాత్రి 7.45 గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి 8.55 గంటలకు మాడవీధుల్లో శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. 28వ తేదీ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం నూతన పరకామణి భవనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలాజీ నగర్ లో నిర్మించిన రెస్ట్ రూమ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం తిరుమల నుంచి సీఎం జగన్ తిరుగు ప్రయాణంకానున్నారు. రేపు ఉదయం 9.45 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సీఎం జగన్ పర్యటించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/