ముంచుకొస్తున్న ‘బిపర్‌జాయ్’..అలర్ట్ ప్రకటించిన కేంద్రం

బిపోర్‌ జాయ్‌ తుపాను ముంచుకొస్తోంది. గురువారం మధ్యాహ్నం ఈ తూఫాన్ గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తూఫాన్ నేపథ్యంలో ఢిల్లీ లో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్‌ తీరంలోని కచ్‌, పోర్‌బందర్‌, దేవభూమి ద్వారక, జాంనగర్‌, జునాగఢ్‌, మోర్బి జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

ప్రస్తుతం బిపర్‌జాయ్ తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో పోరబందర్‌కు నైరుతివైపు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తుఫాన్ తీరం దాటనుంది. మంగళవారం గుజరాత్ అధికారులు తీర ప్రాంతాల్లోని సుమారు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర, కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నారు.

తుఫాన్‌ ప్రభావంతో పశ్చిమ తీరం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్ర లోని రత్నగిరి దగ్గర బీచ్‌లో రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. అలల ఉధృతి చూసి అక్కడ ఉన్న టూరిస్టులు భయంతో పరుగులు పెట్టారు.