పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా..? అంటూ కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ..

పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా..? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాసారు. కేసీఆర్‌కు ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించే తీరిక లేదన్నారు. కానీ పట్నా వెళ్లి రాజకీయాలు చేసే టైం ఉందా?, పేదల ప్రాణాలకంటే..రాజకీయాలే ముఖ్యమా? అని ఆయన ప్రశ్నించారు. హైద‌రాబాద్ శివారు ఇబ్ర‌హీంప‌ట్నం ప్రభుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు విక‌టించి న‌లుగురు మ‌హిళ‌లు మృతి చెందిన విష‌యాన్ని స‌ద‌రు లేఖ‌లో కోమ‌టిరెడ్డి ప్ర‌స్తావించారు.

సీఎం కేసీఆర్ బుధ‌వారం పాట్నా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌తో భేటీ అయిన కేసీఆర్‌… జాతీయ రాజ‌కీయాల‌పై వారితో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇటు ఇబ్ర‌హీంప‌ట్నం మృతులు, అటు బీహార్ ప‌ర్య‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ కేసీఆర్‌కు కోమ‌టిరెడ్డి లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు.. కానీ విమానంలో పాట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమ‌టిరెడ్డి స‌ద‌రు లేఖలో కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు.

మరోవైపు ఈ ఘటన ఫై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని..చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసారు. చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉన్న క్రమంలో.. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా.. సీఎం కేసీఆర్ రివ్యూ చేయలేదని విమర్శించారు.