ఆ బాధలోనే విమర్శలు చేశా..కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

అన్ని అర్హతలున్నా టీపీసీసీ పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుంది.. కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

భువనగిరి : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ను అధిష్ఠానం నియమించిన తర్వాత.. “పదవిని మాణిక్కం ఠాగూర్ రూ.25 కోట్లకు అమ్ముకున్నారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టుంది. నన్నెవరూ కలవడానికి రావొద్దు’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలోని వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన మాట్లడుతూ..అన్ని అర్హతలున్నా టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని అన్నారు. ఆ బాధలోనే విమర్శలు చేశానే తప్ప తనకు వేరే ఉద్దేశాలేవీ లేవని స్పష్టం చేశారు.

పార్టీ సీనియర్ నేతగా ఆవేదనతోనే ఆ విమర్శలు చేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేశానని, తనకు పదవులు లెక్క కాదని అన్నారు. తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిందని, తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో పరిణామాలపై విమర్శలు చేసినంత మాత్రాన పార్టీ మారినట్టేనా? అని ప్రశ్నించారు. పైసా తీసుకోకుండా కార్యకర్తలు తనను ఎంపీగా గెలిపించారని చెప్పారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/