ఈటల ఫై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. స్పీకర్ పోచారం మర మనిషి అంటూ ఈటల రాజేందర్.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనకు 20 ఏండ్ల సీనియార్టీ ఉందని మాట్లాడుతున్న ఈటల.. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరుస్తూ మాట్లాడటం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. స్పీకర్ తన బాధ్యతలను నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారని తెలిపారు.
సభ్యుల సంఖ్యను బట్టి బీఏసీలో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి బీఏసీలో అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. బీజేపీకి భయపడి అసెంబ్లీ నిబంధనలు మారుస్తామా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే.. మరి లోక్‌సభ స్పీకర్ ప్రధాని మోదీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా? అని ఈటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు.
స్పీకర్ విషయంలో మాట్లాడేముందు సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, స్పీకర్‌ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీని అవమానపరిచినట్టే అని మంత్రి వేముల అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.