కన్యాకుమారి కి వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ రేపు (సెప్టెంబర్ 07 ) భార‌త్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా దాదాపుగా 3,500 కిలోమీట‌ర్ల మేర సాగ‌నున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు శంఖారావాన్ని పూరించ‌నుంది. ఈ యాత్ర ప్రారంభం నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలు కన్యాకుమారి కి బయలుదేరివెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ సహా పలువురు కన్యాకుమారి వెళ్లారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) మంగ‌ళ‌వారం రాహుల్ యాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భ‌వ‌న్‌లో ఈ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. యువజన కాంగ్రెస్‌, పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐలు ఈ పోస్ట‌ర్ల‌ను రూపొందించాయి. అక్టోబర్ 24న జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ అవుతుందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఎంటరై, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కుల్ నియోజకవర్గంలో ముగుస్తుందని చెప్పారు. 4 లోక్‌‌‌‌సభ ,9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుందని పేర్కొన్నారు. ఇక భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం 13 రోజుల పాటు జరగాల్సిన యాత్రను మరో రెండు రోజులు పెంచారు. మొత్తం 15 రోజులపాటు రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.