మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మృతి

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. విశాఖపట్టణంలోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. వట్టి వసంత్‌కుమార్‌ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రోశయ్య కేబినెట్‌లోనూగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కొనసాగారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు వసంత్‌కుమార్.

టీడీపీ- కాంగ్రెస్ కలయిక తర్వాత హస్తంపార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. 2014 నుంచి కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వసంత్ కుమార్ భేటీ కావడంతో ఆ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. పవన్ కల్యాణ్‌తో తాను రాజకీయాలేమీ చర్చించలేదని, మర్యాద పూర్వకంగానే తను కలిశానని చెప్పుకొచ్చారు. ఇక వట్టి వసంత్‌కుమార్‌ భౌతికకాయాన్నిస్వగ్రామం పూండ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వసంత్‌కుమార్‌ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.