వర్మ ట్వీట్ తో రాష్ట్రపతి వివాదం సద్దుమణుగుతుందా..?

నిత్యం ఏదొక వివాదంతో వార్తల్లో నిలువడం వర్మ స్టయిల్. సినిమాలతోనే కాదు రాజకీయాల విషయాల్లోను పలు వివాదాస్పద ట్వీట్స్ చేస్తుంటాడు. తాజాగా NDA రాష్ట్రపతి అభ్యర్థి ఫై వర్మ ట్వీట్ చేయడం ఫై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు సైతం పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్సీకి అవకాశమిచ్చిన ఎన్డీఏ ఈ సారి ఎస్టీ మహిళకు అవకాశమిచ్చింది. దీంతో ద్రౌపది ముర్ము ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో వర్మ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై అభ్యంతరకరమైన పోస్టు ను పెట్టాడు.

ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ కావడం తో బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ష్ట్రపతి అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వర్మ చేసిన ట్వీట్ ను నేతలు పోలీసులకు ఇచ్చారు. ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మపై అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఆదివాసీ మహిళను కించపరిచేలా కామెంట్ చేసిన వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో దీంతో వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో వివాదానికి ముగింపు పలికేలా ఆయన ప్రయత్నం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చారు. మహాభారతంలో ద్రౌపది పాత్ర తనకు నచ్చుతుందని, ద్రౌపది పేరు చాలా అరుదుగా ఉంటుందని ట్వీట్ లో తెలిపారు. ఆ పేరు వినగానే తనకు ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని వెల్లడించారు. ఎవరి సెంటిమెంట్ లను గాయపరిచాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చారు.