తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బీజేపీ మోసం చేస్తుంది – కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్..బిజెపి పార్టీ ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. బుధువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. గ్యాస్ ధరలు తగ్గిస్తామన్న మోడీ ఇప్పుడు దాన్ని డబుల్ చేశారని విమర్శించారు. ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్ కు మొక్కి బీజేపీకి ఓటు వేయమన్న మోడీ.. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర రూ.1050కు పెంచారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు పచ్చి మోసగాళ్లని విమర్శించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు ప‌చ్చి మోస‌గాళ్లు.. వారిని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి. మ‌న పార్టీనే ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ కోసం కేసీఆర్ క‌డుపులో ఉండే బాధ‌, కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల‌కు ఉండ‌దు. వారికి 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టి. మ‌న‌కు ఉన్న‌ది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ‌. ఏనాటికైనా మ‌న ఇంటి పార్టీనే శ్రీరామ‌ర‌క్ష అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌సాయ ఆధార ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌ర్సంపేట‌లో నెల‌కొల్పుతామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిది అని తెలిపారు. న‌ర్సంపేట అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. చెరువు, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు ఖ‌ర్చు చేస్తామ‌న్నారు. ఏ ఎల‌క్ష‌న్లు లేన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నామ‌ని చెప్పారు. న‌ర్సంపేట‌ను ఒక ఉద్య‌మ కేంద్రంగా మార్చి.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నర్సంపేట స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించామని చెప్పారు. త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.