జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి

పూజలకు ఏర్పాట్లు చేయాలని, పూజారిని నియమించాలని ఆదేశాలు

varanasi-court-issues-key-orders-in-gyanvapi-case

వారాణాసి: ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారాణాసి డిస్ట్రిక్ట్ కోర్టు నేడు కీలక ఆదేశాలు వెలువరించింది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ… మరో ఏడు రోజుల్లో పూజ ప్రారంభమవుతుందని, ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే, వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను తాము పై కోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు.

మరోవైపు వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారత పురతత్వశాఖ (ఏఎస్ఐ) ఇటీవల వెల్లడించింది. వాటిలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది.

తవ్వకాల్లో బయటపడిన కళాఖండాల్లో విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు బయటపడడం అక్కడ అభివృద్ధి చెందిన సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు. తవ్వకాల్లో బయటపడిన వాటిలో సగం విరిగిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. కింది సగభాగం మాత్రమే ఉన్న ఈ శిల్పం కాళ్లు ఓ రాతిపై ఉన్నాయి. ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ కావడం గమనార్హం. మరో విగ్రహం మధ్యయుగ ప్రారంభం కాలం నాటిది. ఇందులో సగం మనిషి, సగం సర్పం ఉంది. ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహావతారాన్ని సూచిస్తోంది.

అలాగే, నాలుగు చేతులతో ఉన్న సంప్రదాయ భంగిమలో శంకు, చక్రాలు ధరించి కూర్చుని ఉన్న విరిగిన విగ్రహం ఒకటి తవ్వకాల్లో వెలుగుచూసింది. అలాగే, మధ్యయుగ ప్రారంభం కాలంనాటి విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు లభ్యమయ్యాయి. ఇందులో ఒక విగ్రహం నాలుగు చేతులలో మూడు, ముఖం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓ పీఠంపైన నిలబడిన ఆకారంలో ఉంది. మరోటి విష్ణువు పక్కన భక్తుడు, పరిచారిక ఉన్నట్టుగా ఉంది. మరో శిల్పం హనుమంతుడి పైభాగానికి సంబంధించినది. ఒక చేత్తో హనుమంతుడు గదాధారుడై ఉన్నాడు.