జగనన్న స్టిక్కర్ల పథకం ఫై వంగలపూడి అనిత సెటైర్లు

తాజాగా వైస్సార్సీపీ సర్కార్ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ఇంటింటికి స్టిక్కర్ల అంటించే పనిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఇంటి తలుపులు, గోడలపై అంటిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం తొలి రోజు పలు చోట్ల ‘ఈ దిష్టి బొమ్మ’ మా గుమ్మాల ముందెందుకు అని నేతలను మొహం మీదే అగినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల వాళ్ల ఎదురుగానే స్టిక్కర్లు చింపేశారు కూడా. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో స్టిక్కర్ల పట్ల విముఖత ఉన్నప్పటికీ.. తమ ఇళ్లకు వైస్సార్సీపీ కార్యకర్తలతో పాటు వలంటీర్లు రావడం, వారు కన్నెర్ర చేస్తే పెన్షన్‌ తదితర పథకాలు రద్దవుతాయన్న భయం ఉండడంతో ప్రజలు మౌనంగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటె ఈ స్టిక్కర్లు అంటించడం ఫై టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నిన్న రాష్ట్రంలో కొత్త పురోహితులను చూశాను. కొంత మంది భుజానికి సంచులు వేసుకొని భజన బృందంలా తిరుగుతున్నారు. జగనన్నే మా భవిష్యత్తు అనే స్టిక్కర్లు వారే ఇళ్లకు అంటిస్తున్నారు. సీఎం జగన్ జగనన్న స్టిక్కర్ల పథకానికి శ్రీకారం చుట్టారు. జైలులో 13 నెలలు ఉండి బయటకు వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి భవిష్యత్తా? ఈసారి నుంచి మాట తప్పదు మడమ తిప్పడు అన్న వైస్సార్సీపీ నాయకుల నాలుకను ప్రజలు కొయ్యాలి. సీఎం జగన్ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. నేను మాట్లాడుతున్న మాటలపై ఎవరు చర్చకు వచ్చిన నేను సిద్ధం ‘ అని అనిత అన్నారు.

మరోపక్క ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ వైస్సార్సీపీ ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటిస్తుంటే.. అందుకు ప్రతిగా జనసేన పార్టీ తిరుపతిలో శనివారం ‘మాకు నమ్మకంలేదు జగన్‌, మా నమ్మకం పవన్‌’ అనే స్టిక్కర్లను వైస్సార్సీపీ స్టిక్కర్ల పక్కనే అంటిస్తూ నిరసన తెలిపింది.