కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆదరణను ఓర్చుకోలేకపోతున్నారుః వీహెచ్

సీఎంగా ఉన్నంత కాలం ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ లో ఉండేవారన్న వీహెచ్

Congress Leader V Hanumantha Rao
Congress Leader V Hanumantha Rao

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదని ఆయన విమర్శించారు. నల్గొండలో భారీ బహిరంగసభ ద్వారా ప్రజల్లోకి కెసిఆర్ వెళ్తున్నారని… గత పదేళ్ల కాలంలో ఏనాడైనా ప్రజల్లోకి ఆయన వెళ్లారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం… ఉంటే ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ లో ఉండేవారని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే… కృష్ణా జలాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వీహెచ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, ఓర్చుకోలేకపోతున్నారని… ఫ్రస్ట్రేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అవినీతిపై కూడా దర్యాప్తు చేయిస్తామని అన్నారు.