ఏప్రిల్ 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27 న నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో వేడుకలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు వెళుతున్నాయి. ఉదయం 10 గంటలకల్లా పార్టీ ప్రతినిధులందరూ సమావేశ మందిరానికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.

టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు హైదరాబాద్ లో నిర్వహించే ప్రధాన స‌మావేశానికి రాష్ట్ర మంత్రివ‌ర్గంతో పాటు లోక్‌స‌భ‌, రాజ్యస‌భ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ల చైర్మ‌న్‌లు, జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్య‌క్షులు, జిల్లా గ్రంథాల‌యాల సంస్థ అధ్య‌క్షులు, జిల్లా రైతుబంధు స‌మితి అధ్య‌క్షులు, మ‌హిళా కోఆర్డినేట‌ర్లు, జ‌డ్పీటీసీ స‌భ్యులు, మున్సిప‌ల్ మేయ‌ర్లు, చైర్మ‌న్లు, మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షులు, ప‌ట్ట‌ణాల‌, మండ‌లాల పార్టీ అధ్య‌క్షులు, వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు హాజ‌రు కానున్నారు. ప్ర‌త్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రవుతారు.

కార్యక్రమ నిర్వహణ వివరాలు చూస్తే ..

• ఏప్రిల్ 27 బుధవారం ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులందరూ హైద్రాబాద్ మాదాపూర్ నందుగల హెచ్ ఐ సిసి సమావేశమందిరానికి చేరుకోవాలి.
• ఉచయం 10 గంటలనుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు.
• ఉదయం 11:05 గంటలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆగమనం.
పార్టీ పతాకావిష్కరణ.
• స్వాగతోపన్యాసం
• అధ్యక్షుల వారి తొలిపలుకులు
• దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టడం
• వాటి పై చర్చించి ఆమోదించడం.
• సాయంత్రం 5 గంటల దాకా కొనసాగి…ముగింపు.

కోవిడ్ కారణాల వల్ల రెండేళ్లుగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని సరిగా నిర్వహించలేదు. గతేడాది ఇదే సమయంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్టోబర్ 25న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగానే ఉండటంతో ఈసారి ఏప్రిల్ 27నే నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున పార్టీ ప్లీనరీని కూడా నిర్వహించనున్నారు. వరి వివాదం, వ్యవసాయం, కరెంటు, విభజన హామీలు తదితర అంశాల్లో కేంద్రంలోని బీజేపీపై ఇప్పటికే టీఆర్ఎస్ పోరుబాటలో పయనిస్తుండగా, యుద్దాన్ని మరింత ఉధృతం చేస్తూ గులాబీ దళపతి రణభేరి మోగించనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంలో ఇప్పటికే ఓసారి ఢిల్లీలో దీక్ష చేసొచ్చిన సీఎం కేసీఆర్ మరోసారి రైతుల అంశాలే ప్రాతిపదికన హస్తినలో పర్యటిస్తారని, ఉత్తరప్రదేశ్ లో రైతులపై హింసాకాండ చోటుచేసుకున్న లఖీంపూర్ ఖేరీని సందర్శిస్తారని తెలుస్తోంది.