అసెంబ్లీ ప్రాంగణంలో పరస్పరం ఎదురుపడిన కెటిఆర్‌ రాజగోపాల్ రెడ్డి

తనను వివాదంలోకి లాగవద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి

komatireddy-and-ktr

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కెటిఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి పదవి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ అంశానికి సంబంధించి కెటిఆర్… రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే తనను వివాదంలోకి లాగవద్దని సరదాగా వ్యాఖ్యానిస్తూ కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలో కెటిఆర్‌కు కోమటిరెడ్డి ఎదురయ్యారు.

ఈ సమయంలో… మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? అని కెటిఆర్ ప్రశ్నించారు. దీనికి కోమటిరెడ్డి… మీలాగే నాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు. దీంతో కెటిఆర్… ఫ్యామిలీ పాలన కాదు… మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయన్నారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అంశంపై అడిగారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా? సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కెటిఆర్ అడిగారు. అయితే రాజగోపాల్ మాత్రం… దయచేసి తనను వివాదంలోకి లాగవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. కెసిఆర్‌ దగ్గరుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి పంపిస్తారని విమర్శించారు. వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి బిఆర్ఎస్ వాళ్లు బిజెపిలో చేరుతారన్నారు. తాను హోంమంత్రినై బిఆర్ఎస్ వాళ్లను జైలుకు పంపించాలని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ను గద్దె దించేందుకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు.