మరో 2 గంటల్లో బయటకు రానున్న ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు

Uttarkashi Tunnel Collapse news update..Rescue efforts in final phase

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ చివరిదశకు చేరింది. సొరంగంలో కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు.. వారిని గురువారం ఉదయం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని రెస్క్యూ బృందంలో సభ్యుడు, జోజిలా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌ హర్పాల్‌ సింగ్‌ చెప్పారు. సహాయక చర్యలు తుది అంకానికి చేరాయి. మరో 2 గంటల్లో వారిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటికే పైప్‌ లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఇనుప ముక్కలను కత్తిరించి తొలగించామన్నారు.

బుధవారం రాత్రి 21 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సొరంగంలోకి వెళ్లారు. వారితోపాటు ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర సమాగ్రిని తీసుకెళ్లారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత.. వారిని దవాఖానకు తరలించేందుకు అధికారులు 41 అంబులెన్స్‌లు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి 41 బెడ్‌ల తాత్కాలిక హాస్పిటల్‌ ఏర్పాటుచేశారు.

కాగా, ఈ నెల 12న తెల్లవారుజామున చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌లో కొంతభాగం కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో 57 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోవడంతో 41 మంది కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు నాటినుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 6 అంగుళాల వ్యాసం గల పైప్‌లైన్‌ ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఈ నెల 21న ఆహారం పంపించిన విషయం తెలిసిందే. 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఇనుప పైప్‌లను శిథిల్లాలోకి పంపించారు. దీంతో 12 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు ముగియనున్నాయి.