యూపీ తాత్కాలిక డీజీపీగా ప్ర‌శాంత్ కుమార్‌ నియామకం

Uttar Pradesh govt appoints Prashant Kumar as acting DGP

ల‌క్నో: ఉత్త‌రప్ర‌దేశ్ తాత్కాలిక డీజీపీగా ప్ర‌శాంత్ కుమార్‌ ను నియ‌మించారు. లా అండ్ ఆర్డ‌ర్ డీజీగా ఉన్న ఆయ‌నకు.. డీజీపీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అయితే వరుస‌గా నాలుగ‌వ సారి యూపీ డీజీపీ పోస్టును తాత్కాలిక హోదాలో నియ‌మించారు. దీన్ని విప‌క్ష నేత ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ ఖండించారు. ఎందుకు ప్ర‌తిసారి డీజీపీల‌ను తాత్కాలిక హోదాలో నియ‌మిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఢిల్లీ, ల‌క్నో మ‌ధ్య ఉన్న సంబంధాల వ‌ల్లే ఇలా జ‌రుగుతోందా అని ఆయ‌న అడిగారు. ప్ర‌భుత్వం, క్రిమిన‌ల్స్ మ‌ధ్య ఒప్పందాలు ఉన్న‌ట్లు ఆరోపించారు.

ప్ర‌స్తుత డీజేపీ విజ‌య్ కుమార్ ఇవాళ రిటైర్ అవుతున్నారు. ఆయ‌న స్థానంలో ప్ర‌శాంత్ కుమార్‌.. తాత్కాలిక డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న‌ది బీహార్‌. 2022 మే 11వ తేదీన ముఖుల్ గోయ‌ల్ ను తొల‌గించిన త‌ర్వాత యూపీకి ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయి డీజీపీని నియ‌మించ‌లేదు. ఆ రాష్ట్రానికి వ‌రుస‌గా తాత్కాలిక డీజీపీని నియ‌మించడం ఇది నాలుగ‌వ‌సారి. గోయ‌ల్ ప్ర‌స్తుతం సివిల్ డిఫెన్స్ డీజీగా ఉన్నారు.

కగా, గోయ‌ల్ త‌ర్వాత డీఎస్ చౌహాన్‌, ఆర్కే విశ్వ‌క‌ర్మ‌, ఆ త‌ర్వాత విజ‌య్ కుమార్‌ల‌ను తాత్కాలిక డీజీపీలుగా నియ‌మించారు. గ‌త ఏడాది మే 31వ తేదీన విజ‌య్ కుమార్‌ను యాక్టింగ్ డీజీపీగా నియ‌మించారు.