ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శాకుంతలం

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రం తాలూకా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న ఈ మూవీని పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ తీరా సమయానికి సినిమాను వాయిదా వేస్తున్నామని , కొత్త రిలీజ్ డేట్ ను అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పి షాక్ ఇచ్చారు.

ఈ క్రమంలో ఏప్రిల్ 14 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన చేసారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరి ఈ డేట్ నే ఫిక్స్ అవుతారో.. లేదా మళ్లీ వాయిదా వేసి కొత్త తేది ప్రకటిస్తారో వేచి చూడాలి. ఏప్రిల్ 14న ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ ఉగ్రం, రాఘవ లారెన్స్ రుద్రుడు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, కబీన్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇక చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.