కాంగ్రెస్ లో ఉంటే జరగని అభివృద్ది.. బీజేపీ లోకి వెళ్తే జరుగుతుందా అని రాజగోపాల్ కు ఉత్తమ్ సూటి ప్రశ్న

కాంగ్రెస్ లో ఉంటే జరగని అభివృద్ది.. బీజేపీ లోకి వెళ్తే జరుగుతుందా అని కోమటిరెడ్డి రాజగోపాల్ ను ప్రశ్నించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మునుగోడులో ఎప్పుడు ఎన్నికలోచ్చిన కాంగ్రెస్ నే గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్పై మాజీమంత్రి దామోదర్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. 1999కి ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడున్నారని నిలదీశారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఎన్నోసార్లు నోరుపారేసుకున్నారని.. ఆయన చరిత్ర అంతా తనకు తెలుసన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ షా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి ఎటువంటి నష్టంలేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు బ్రాండ్ ఏంలేదని..అంతా కాంగ్రెస్ బ్రాండేనని అన్నారు.

ఏ తల్లి ఆశీర్వదిస్తే గెలిచిండో… ఆ తల్లి కష్టాల్లో ఉంటే అమిత్ షా దగ్గర ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. బేరసారాలు ఆడుకుంటున్నాడని, తల్లి గుండె పై తన్ని పోతున్నాడు రాజగోపాల్‌రెడ్డి అంటూ ఆమె మండిపడ్డారు. సొంత పనుల కోసం బీజేపీ లో చేరుతున్నాడు అని ఆమె విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎలా చెడ్డ పార్టీ అవుతుంది అనేది ఆలోచన చేయాలి ప్రజలు అని ఆమె వ్యాఖ్యానించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యే లను కొనుక్కోవడం.. ధరలు పెంచడం… ప్రభుత్వాలు కుల్చడమే బీజేపీ పని అని ఆమె మండిపడ్డారు.