నేడు చంద్రబాబు అధ్యక్షతన టిడిపి వర్క్‌షాప్

tdp-chandrababu

అమరావతిః రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టిడిపి ఉంది. గెలుపు కోసం టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాలను రచిస్తున్నారు. చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టిడిపి అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను టిడిపి విడుదల చేసింది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జీలకు ఈరోజు టిడిపి వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ కు చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వర్క్ షాప్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. 11 గంటలకు వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు… వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైఎస్‌ఆర్‌సిపి పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.