స్వలింగ వివాహ బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బిడెన్

US President Joe Biden signs same-sex marriage bill into law, calls a ‘vital step

వాషింగ్టన్ః అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌) చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టంగా మారింది.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. ‘ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు, అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానంటే, ఇవాళ నేను సేమ్ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై సంతకం చేశాను’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, సెనేట్‍లో ఆమోదం పొందిన స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు ఆ తర్వాత ప్రతినిధుల సభకు చేరింది. అక్కడ కూడా ఈ చట్టానికి ఆమోదముద్ర పడింది. ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత బిల్లును సంతకం కోసం అధ్యక్షుడు బైడెన్‌ దగ్గరికి పంపించారు. తాజాగా ఆయన సంతకం కూడా పూర్తవడంతో సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్ కార్యరూపంలోకి వచ్చినట్లయ్యింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/