కరోనా బారినపడిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా బారిన ప‌డ్డ బైడెన్‌కు స్వ‌ల్పంగానే వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అధ్య‌క్ష భ‌వ‌నంలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నట్లు ప్రెస్​ సెక్రటరీ తెలిపారు.ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తో పాటు బూస్ట‌ర్ డోస్‌ను కూడా తీసుకున్న బైడెన్ కరోనా బారినపడడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. బైడెన్ త‌న అధికారిక విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నార‌ని వైట్ హౌస్ తెలిపింది.

ఇక ఇండియా లోను కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య దేశవ్యాప్తంగా 21,566 కోవిడ్ కేసులు, 45 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే..గడిచిన 24 గంటల్లో 765 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. 648 మంది బాధితులు కోలుకోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,12,381కి చేరింది. ఇందులో 8,03,661 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,609 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 35,094 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 98.93శాతం రికవరీ రేటు ఉండగా.. 0.51శాతం మరణాల రేటుందని ఆరోగ్యశాఖ తెలిపింది.