ద్రౌపది ముర్ము కు శుభాకాంక్షలు తెలిపిన జగన్..

భారత 15 వ రాష్ట్రపతి గా ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు , ద్రౌపదీ ముర్ము కు మద్దతు పలికిన నేతలు , ఆదివాసులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ద్రౌపదీ ముర్ము కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ ద్రౌపదీ ముర్ము ఇంటికి వెళ్లి అభినందనలు తెలుపగా , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముర్ముకు అభినంద‌న‌లు తెలిపి ఆమెకు మిఠాయి తినిపించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము విజయం.. వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మహిళా, బలహీన వర్గాల సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ప్రజా జీవితంలో ముర్ముకు ఉన్న గొప్ప అనుభవం, ఆమె ఎన్నికైన అత్యున్నత పదవిని అలంకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. ముర్ము రాష్ట్రపతిగా గెలవడం ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. కౌన్సిలర్ గా, MLA, గవర్నర్ గా సేవలు అందించి ప్రజల మెప్పుపొందిన ముర్ము..రాష్ట్రపతిగా మరింత గొప్పగా సేవలందించాలని ఆకాంక్షించారు. ముర్ముకు ఓటేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు.