విదేశాల నుంచి వచ్చిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలి

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల సమీక్షలో సీఎం కెసిఆర్

TS CM KCR

Hyderabad: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ సర్కార్ అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కరోనాపై ఆయన మాట్లాడుతూ కరీంనగర్ సంఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు ఉన్నాయనీ, అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు వలంటరీగా ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని కేసీఆర్ అన్నారు.మార్చి 1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.

మార్చి 31 వరకూ సినిమా హాళ్లు, పార్కులు, మాల్స్ మూసివేయాలని ఆదేశించారు.  భద్రాద్రి సీతారామ కల్యాణోత్సవాలను రద్దు చేసినట్లు ప్రకటించారు.

సీతారామ కల్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఉగాదికి నేరుగా పంచాంగ శ్రవణం లేదని చెప్పిన కేసీఆర్ అది కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తామని పేర్కొన్నారు.

ఎక్కువ మంది  గుమిగూడకుండా ఉండటం ద్వారా మత్రమే కరోనాకు కట్టడి చేయగలమని కేసీఆర్ అన్నారు. జాగ్రత్తలు తీసుకున్న దేశాలలో కరోనా వ్యాప్తి స్వల్పంగా ఉందన్నారు.

చైనా పక్కనే ఉన్న వియత్నాంలో కరోనా వ్యాప్తి లేదని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైనందునే చైనా, ఇటలీలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో వారం పాటు మూసివేయాలని ఆదేశించామనీ, ఇప్పుడు వాటి గడువును మార్చి 31 వరకూ పొడిగిస్తున్నామనీ కేసీఆర్ చెప్పారు.

టెన్త్ పరీక్షలు యథాతథం

పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. టెన్త్‌ పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేస్తున్నామని చెప్పారు.

మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీలు అన్ని మూసివేయాలని అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు సహకరించాలని ఆయన కోరారు. 

 నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయని చెప్పిన ఆయన కొరతను సృష్టించే బ్లాక్‌ మార్కెట్‌గాళ్లను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు పెంచాలని ఆదేశించినట్లు చెప్పారు. 200 మంది బంధువులకు మించకుండా రాత్రి 9 గంటల లోపే పెండ్లీలు ముగించాలని కేసీఆర్ పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం :https://www.vaartha.com/news/movies/