రష్యా ముడి చమురుపై నిషేధం విధించిన అమెరికా

నిధుల కొరత సృష్టించడమే లక్ష్యం ..జో బైడెన్‌

president-joe-biden

వాషింగ్టన్‌: రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్యాపై అమెరికా ఆంక్షల తీవ్రతను పెంచింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం శ్వేతసౌధంలో మాట్లాడారు. ‘రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌, ఎనర్జీ దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం’ అన్నారు. రష్యా నుంచి దిగుమతులు ఆగిపోతే ఆ దేశానికి నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమతో పోలిస్తే ఐరోపా దేశాలు రష్యా చమురు ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడ్డాయని పేర్కొన్న బైడెన్‌.. తాజా ఆంక్షల విషయంలో ఆయా దేశాలు తమతో కలిసి రాకపోయినా అర్థం చేసుకొంటామన్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలంటే చమురు దిగుమతులపై ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను అభ్యర్థించారు. ఈ క్రమంలోనే బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/