లోకేష్ నరసరావుపేట పర్యటన..ఏంజరుగుతుందో అనే టెన్షన్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేట లో పర్యటన చేయబోతున్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రానున్నారు. అయితే లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

కొవిడ్ దృష్ట్యా లోకేశ్ పర్యటనకు అనుమతి ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. అనూష హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ చేశామని చెప్పారు. పాత కేసులతో ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేయొద్దని కోరారు. అయితే టీడీపీ నేతలు మాత్రం లోకేష్ పర్యటన ను అడ్డుకోవడం తగదని , లోకేశ్ పర్యటనను అడ్డుకోవటం హీరోయిజం కాదనే విషయం గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ గుర్తించాలని తెదేపా సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. చేతనైతే అనూషని క్రూరంగా చంపిన విష్ణువర్థన్ రెడ్డిపై హీరోయిజం చూపించాలన్నారు. నేరస్థుడు బెయిల్​పై బయట తిరుగుతుంటే అనూష కుటుంబానికి న్యాయం చేశామని విశాల్ గున్నీ చెప్పటం సిగ్గుచేటని మండిపడ్డారు.

‘‘బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పా?. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, పోలీసు రాజ్యంలో ఉన్నామో అర్థమవటంలేదు. ప్రజాస్వామ్యయుతంగా చేసే ఆందోళనలను అడ్డుకోవడంలో అర్థంలేదు. టీడీపీ హయాంలో మేమిలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా?. వైసీపీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదు.’’ అని అనందబాబు హెచ్చరించారు. మరికాసేపట్లో లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు రానున్న తరుణంలో ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. లోకేష్ పర్యటన నేపథ్యం లో టెన్షన్ వాతావరణం నెలకొంది.