అలాంటి వారికీ టికెట్ ఇచ్చే ప్రసక్తేలేదు – జగన్

వైస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు సోమవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రిజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమలో ప‌నిచేసిన వాళ్ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామని , తన మీద అలిగినా ఫ‌ర‌వా లేద‌ని, ప‌నిచేయ‌ని వాళ్ల‌కు టికెట్లు ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పారట. త‌న‌తో పాటు ఎమ్మెల్యేలు క‌లిసి ప‌నిచేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించినట్లు తెలుస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలతో గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన వర్క్ షాప్ నిర్వహించిన జగన్…ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నదీ పూర్తి వివరాలు వారి ముందుంచారు.

అందులో పది రోజుల్లోపు వెళ్లిన వారి సంఖ్య 22 ఉండగా.. అసలు ఇప్పటి వరకు కార్యక్రమం ప్రారంభించని ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నట్లుగా తేల్చారు. ఇక ఈ కార్యక్రమంలో అందరి కంటే ఎక్కువగా జనాల్లోకి వెళ్లిన వారిలో విప్ ప్రసాద రాజు తొలి స్థానంలో నిలిచారు. మరో 15 మంది ఎమ్మెల్యేలు అయిదు రోజులకే కార్యక్రమం ముగించినట్లుగా తేలింది. ఎమ్మెల్యేలుగా తిరిగి రావాలనుకుంటే కష్టపడండి.. లేదనుకుంటే తనకు ఇబ్బంది లేదని సీఎం స్పష్టం చేసారు. 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వారికి న్యాయం జరగాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం విశ్లేషించారు. మరోసారి కుప్పం నియోజకవర్గం గురించి సీఎం ప్రస్తావించారు. ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు జీవో సైతం జారీ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయిస్తున్నట్లు వివరించారు. గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని నిర్దేశించారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు- గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు.