అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్‌, బైడెన్‌ ముఖాముఖి ఫైట్‌

పత్రికల్లో దుష్ప్రచారం కారణంగానే తనకు చెడ్డపేరు వచ్చిందన్న ట్రంప్

ట్రంప్ విధానాల వల్లే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారన్న బైడెన్

First Presidential Debate Biden-Trump

క్లీవ్‌లాండ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్, జోబైడెన్‌ల మధ్య చర్చలు ఆసక్తిగా సాగాయి. ఈరోజు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన అధ్యక్ష అభ్యర్థులు ముఖాముకి వివిధ అంశాలపై తమ వాదనను ప్రజలకు వినిపించారు. క్లీవ్‌లాండ్‌లో జరిగిన ఈ ముఖాముఖి చర్చకు క్రిస్ వాలెన్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఒబామా కేర్, ఆరోగ్య బీమా, కరోనా వంటి అంశాలపై తన వాదన వినిపించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కేర్ భారీ ఖర్చుతో కూడుకున్నవ్యవహారం కావడంతో నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ఆరోగ్య బీమాను రద్దు చేయలేదని, తక్కువ ధరలో అందించేందుకు ప్రయత్నించడమే కాకుండా అందులో భాగంగా నూతన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు.

కరోనాను మరోమారు చైనా ప్లేగ్‌గా అభివర్ణించిన ట్రంప్, ఈ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థను మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ అప్రమత్తత కారణంగా కరోనా మరణాల రేటును తగ్గించగలిగామన్నారు. చైనా, రష్యా, భారత్‌లలో కరోనా కారణంగా ఎంతోమంది చనిపోయారని, కానీ పత్రికల్లో దుష్ప్రచారం కారణంగానే ఈ విషయంలో తనకు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బైడెన్ అతిపెద్ద మాస్క్ అని, ఎప్పుడు చూసినా ఎదుటి వారితో 200 అడుగుల దూరం నుంచే ఎదుటి వారితో మాట్లాడతారని ట్రంప్ విమర్శించారు.

డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్‌పై పలు విమర్శలు చేశారు. నిజానికి ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు ప్రణాళికే లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఒబామా కేర్‌ను రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక వ్యవహారాలకే ట్రంప్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన విధానాల వల్ల వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని బైడెన్ ఆరోపించారు.

కరోనా కట్టడికి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ కారణంగానే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. తాను 200 అడుగుల దూరంలో ఉండి మాట్లాడతానన్న ట్రంప్ విమర్శలపై స్పందిస్తూ సామాజిక నిబంధనల నేపథ్యంలోనే దూరంగా ఉండి మాట్లాడతానని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/