అధ్య‌క్ష పోటీకి జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్‌ అభ్య‌ర్థిత్వాల‌ ఖ‌రారు

Biden and Trump clinch nominations, heading to another general election rematch

వాషింగ్టన్‌ః ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్య‌క్ష పీఠం కోసం జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్ పోటీ ప‌డ‌నున్నారు. కేవ‌లం అధికారిక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలింది. తాజాగా జార్జియా ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ త‌ర‌ఫున అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన 1,968 మంది ప్ర‌తినిధుల‌ను జో బైడెన్ పొందారు. అటు వాషింగ్ట‌న్‌, మిస్సిసిపీ, నార్త‌ర్న్ మ‌రియానా, ఐలాండ్స్‌లోనూ ఆయ‌న విజయఢంకా మోగించ‌డం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు ధీమాగా ఉన్నాయి.

ఇక జార్జియాలో విక్ట‌రీ త‌ర్వాత త‌న మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశించి బైడెన్ ప్ర‌సంగించారు. “ఈ దేశ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే అవ‌కాశం ఇప్పుడు ఓట‌ర్ల చేతిలో ఉంది. ధైర్యంగా నిల‌బ‌డి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇత‌రుల‌కు అనుమ‌తి ఇస్తారా? మ‌న భ‌ద్ర‌త‌ను, స్వేచ్ఛ‌ను కాపాడుకునే హ‌క్కును పున‌రుద్ధ‌రిస్తారా? లేదా వాటిని దూరం చేసేవారికి అవ‌కాశం ఇస్తారా?” అని బైడెన్ అన్నారు.

కాగా, వాషింగ్ట‌న్‌లోనూ విజ‌యం సాధించి రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేసుకున్నారు. దీంతో ట్రంప్‌ త‌న‌ నామినేష‌న్‌కు కావాల్సిన ప్ర‌తినిధుల మద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్నారు. మ‌రోవైపు బుధ‌వారం వెలువ‌డ‌నున్న మ‌రికొన్ని ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం ఖాయంగానే క‌నిపిస్తోంది. అలాగే చివ‌రి వ‌ర‌కు ట్రంప్‌కు పోటీగా ఉన్న నిక్కీ హేలీ కూడా రేసు నుంచి త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే. ఇలా నిక్కీ హేలీ రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో ట్రంప్‌కు మార్గం సుగ‌మ‌మైంది. దీంతో జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్య‌క్ష పీఠం కోసం బ‌రిలో దిగ‌నున్నారు.