ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌

Union Finance Minister Nirmala Sitharaman Tables The Economic Survey 2022-23 In Parliament

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈరోజు పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. అనంతరం నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించారు. కాగా, బుధవారం ఆమె ఉభయసభల్లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

కాగా, ఆర్థిక సర్వే అనేది చాలా ముఖ్యమైన నివేదిక. ఇది గత సంవత్సర ఖాతాలను, వచ్చే సంవత్సరానికి సంబంధించి సవాళ్లను, పరిష్కారాలను గురించి ప్రస్తావిస్తుంది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ప్రతి ఏటా దీన్ని రూపొందిస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో సమర్పించిన అనంతరం మీడియా సమావేశంలో మీడియా అడిగే ప్రశ్నలకు కూడా ముఖ్య ఆర్థిక సలహాదారు సమాధానాలు ఇస్తారు.